Tuesday, April 22, 2025

టిడిపిలో కోటంరెడ్డికి తగ్గిన ప్రాధాన్యం.. పట్టించుకోని చంద్రబాబు!

- Advertisement -

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టిందా? ఆయన మంత్రి నారాయణను విభేదిస్తున్నారా? జిల్లా టిడిపి నేతలను లెక్కచేయడం లేదా? ఆయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయా? అందుకే టిడిపి హై కమాండ్ ఆయన విషయంలో కాస్త వెనక్కి తగ్గిందా? అంటే అవుననే అంటున్నాయి నెల్లూరు పొలిటికల్ వర్గాలు. గత కొద్ది రోజులుగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు కోటంరెడ్డి. ఈ క్రమంలో సొంత పార్టీని సైతం ఇరుకున పెడుతున్నారు. దీంతో ఒక రకమైన విమర్శలు ఆయనపై వస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 16 నెలల పాటు పదవీకాలం ఉండగానే వైసిపి నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. పార్టీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించే వారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడేవారు. ఒక విధంగా చెప్పాలంటే అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లాలో బీటలు వచ్చే విధంగా వ్యవహరించారు కోటంరెడ్డి. కోటంరెడ్డి కారణంగానే చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు టిడిపిలోకి వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే కోటంరెడ్డి మనస్థాపానికి గురయ్యారని అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే టిడిపి తరఫున గెలిచినా కోటంరెడ్డికి మాత్రం మంత్రి పదవి దక్కలేదు. అయితే లోలోపల బాధపడుతూనే తన భవిష్యత్తు చంద్రబాబు చూసుకుంటారంటూ చెప్పుకొచ్చారు కోటంరెడ్డి.

అయితే 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడింది. ఎన్నడు తెలుగుదేశం పార్టీని ఆదరించిన దాఖలాలు లేవు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. దానికి తానే కారణమని భావిస్తున్నారు కోటంరెడ్డి. తన వల్లే టీడీపీ నెల్లూరు జిల్లాలో గెలిచిందని ఆయన అభిప్రాయం. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబుతో పాటు లోకేష్ కోటంరెడ్డికి ఎంతగానో ప్రాధాన్యమిచ్చారు. అయితే ఇదే తీరుతో మిగతా టిడిపి నేతలపై ఆధిపత్యం చలాయిస్తున్నారట కోటంరెడ్డి. ముఖ్యంగా నెల్లూరు కార్పొరేషన్ విషయంలో మంత్రి నారాయణతో లొల్లి పెట్టుకున్నారు. మంత్రి అయితే ఎవరికి గొప్ప.. కార్పొరేషన్ లో భాగమైన నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో మంత్రి నారాయణ వేలు పెడితే సహించేది లేదని ఆయన అల్టిమేట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాలో ఒకవైపు టిడిపి నేతలను లెక్కచేయడం లేదు. మరోవైపు జంట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి నారాయణ విషయంలో సైతం కోటంరెడ్డి దూకుడుగా ఉన్నారు. దీనిపై చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళుతున్నాయి. అదే సమయంలో లోకేష్ మనుషులు సైతం కోటంరెడ్డి తీరును గమనిస్తున్నారు. దీంతో కోటంరెడ్డిని టిడిపి హై కమాండ్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరి టిడిపిలో కోటంరెడ్డి రెబెల్ గా మారుతారా? సర్దుబాటు చేసుకుంటారా? అన్నది చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!