బొత్సకు జనసేన బంపర్ ఆఫర్ నిజమేనా? ఆ వార్తల్లో నిజం ఎంత? నిజంగా ఆయన మొగ్గు చూపుతున్నారా? జనసేన సైతం ఆసక్తిగా ఉందా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ తో బొత్స చర్చలు జరుపుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నడుస్తోంది. అయితే అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే సోషల్ మీడియా వర్గాలు అదే పనిగా ప్రచారం చేస్తున్నాయి.
బొత్స సత్యనారాయణ బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఉత్తరాంధ్రలో పట్టున్న నాయకుడు. ప్రధానంగా విజయనగరంలో ప్రభావం చూపగల నేత. అటు శ్రీకాకుళం,విశాఖలో సైతం తనదైన ముద్ర చాటుతున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆపై శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్నారు. క్యాబినెట్ హోదాలో కొనసాగుతున్నారు. 2028 దాకా అదే పదవిలో ఉండనున్నారు.
అయితే చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం, కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఇప్పుడు ఆయన చుట్టూ ప్రచారం జరుగుతోంది. కానీ ఇవేవీ ఆయన పట్టించుకోవడం లేదు. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే జరుగుతున్న ప్రచారంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఆందోళనతో ఉన్నాయి.
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గౌరవమైన స్థితిలోనే ఉన్నారు బొత్స సత్యనారాయణ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేని క్యాబినెట్ హోదా బొత్స కు ఉంది. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు స్వేచ్ఛ కూడా ఉంది. ఎనలేని గౌరవం కూడా దక్కుతుంది. విజయనగరం జిల్లాకు చెందిన ఆయనను తీసుకువచ్చి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అటువంటి అవకాశం ఏ నేతకు దొరకదు. ఆ విషయం బొత్స సత్యనారాయణకు కూడా తెలుసు.
పోనీ జనసేనలోకి వెళతారే అనుకుందాం. అక్కడ ఆయనకు ఏ పదవి ఇస్తారు. ఏ గౌరవం కట్ట పెడతారు. మంత్రి పదవి ఇవ్వగలరా? క్యాబినెట్ హోదా తో సమానమైన పదవి కేటాయిస్తారా? అసలు ఆ చాన్స్ ఉందా? 2028 వరకు ఆయనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే క్యాబినెట్ హోదాతో ఉన్న పదవి కొనసాగుతుంది. 2029 ఎన్నికలకు ముందు ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఓ సీనియర్ నేతగా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయనకు తెలుసు. కానీ అదే పనిగా ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుండడం విచారకరం. బొత్స ఎక్కడికి వెళ్ళరని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.