Sunday, March 16, 2025

ఉత్తరాంధ్ర కూటమిలో ప్రకంపనలు.. ఎమ్మెల్సీ ఓటమితో విభేదాలు!

- Advertisement -

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమిలో ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి. తాము బలపరిచిన అభ్యర్థి ఓటమితో కూటమిలో చీలికలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అనూహ్యంగా పిఆర్టియు అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడు విజయం సాధించారు. అయితే కూటమి మాత్రం ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతు తెలిపింది. కానీ ఆయన ఓడిపోయారు. అయితే ఈ ఓటమికి కూటమి పార్టీలే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరంటే మీరే కారణం అంటూ కూటమి పార్టీలు ఒకటికి ఒకటి నిందించుకుంటున్నాయి. దీంతో ఈ వివాదం రాజకీయంగా సంచలనంగా మారుతోంది.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి కూటమి అభ్యర్థిని ప్రకటించలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం తమ అభ్యర్థిని బరిలో దించలేదు. అయితే పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో టిడిపి కూటమి ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతు ప్రకటించింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీ భరత్ తదితరులు ప్రత్యేక ప్రకటన చేశారు. ఉత్తరాంధ్రలో కూటమి నేతలు రఘువర్మ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అయితే ఇప్పుడు రఘువర్మ ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ మాట మార్చింది. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి అచ్చం నాయుడు తాము రఘువర్మకు మద్దతు ప్రకటించలేదని.. రఘువర్మతో పాటు గాదె శ్రీనివాసులు నాయుడును గెలిపించాలని చంద్రబాబు కోరినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఒకవైపు టిడిపి కూటమి తరుపున రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మద్దతు తెలిపారు రఘువర్మకు. ఇప్పుడు ఆయన ఓటమితో మాట మార్చింది టిడిపి.

మరోవైపు రఘువర్మ టిడిపి కూటమి తీరుతోనే తాను ఓడిపోయానని రగిలిపోతున్నారు. అప్పటివరకు గెలుపు బాటలో ఉన్న తాను కేవలం కూటమి మద్దతు తెలపడం వల్లే ఓడిపోయాను అంటూ బాధపడుతున్నారు. ఇంకో వైపు కూటమిలోని వెలమ సామాజిక వర్గం నేతలు గాదె శ్రీనివాసులు నాయుడుకు మద్దతు తెలిపారు. బిజెపికి చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ శ్రీనివాసుల నాయుడు గెలుపు కోసం గట్టిగానే కృషి చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు టిడిపి నేతల సైతం తెరవెనుక సహకారం శ్రీనివాసులు నాయుడుకు అందించారని రఘువర్మ అనుమానిస్తున్నారు. అయితే ఇప్పుడు టిడిపి వర్సెస్ బిజెపి అన్నట్టు పరిస్థితి మారింది. బిజెపి నేతల వ్యవహార శైలి తోనే రఘువర్మ ఓడిపోయారని.. కూటమికి చెడ్డ పేరు వచ్చిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే చేసిందంతా టిడిపి నేతలేనని.. తమను సంప్రదించకుండా రఘువర్మకు ఎలా మద్దతు ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర కూటమిలో విభేదాలపర్వం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!