Monday, February 10, 2025

వైసీపీలోకి కాపు రామచంద్రారెడ్డి రీ ఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్!

- Advertisement -

కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసిపిలో చేరనున్నారా? బిజెపికి గుడ్ బై చెప్పనున్నారా? కూటమి ప్రభుత్వంలో ఆయనకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదా? పార్టీ మారిపోవడమే ఉత్తమమని భావిస్తున్నారా? జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు కాపు రామచంద్రారెడ్డి. ఈ ఎన్నికల్లో వైసిపి హై కమాండ్ టికెట్ నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న తనకు కాదని వేరొకరికి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహించారు. బిజెపిలో చేరిపోయారు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో ఫలితం లేకుండా పోయింది. అందుకే తిరిగి మాతృ పార్టీలో చేరాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాయదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012 ఉప ఎన్నికల్లో 32 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాత్రం ఓటమి చవి చూశారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తెరపైకి మెట్ట గోవిందరెడ్డి వచ్చారు. దీంతో తాను రాయదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుస్తానని శపధం చేశారు కాపు రామచంద్రారెడ్డి. అయితే బిజెపిలో చేరిన ఆయనకు టికెట్ దక్కకుండా పోయింది. ఎన్నికల అనంతరం పట్టించుకునే వారు కరువయ్యారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో కాపు రామచంద్రారెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. కేవలం టిక్కెట్ ఇవ్వలేదన్న కోపంతోనే ఆయన ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు. కానీ వైసీపీలో ఉన్నంత గౌరవం బిజెపిలో లేకుండా పోయింది. కనీస స్థాయిలో కూడా టిడిపి ఆయనను పట్టించుకోవడం లేదు. బిజెపిలో ఉంటే తన ఉనికి కోల్పోవడం ఖాయమని కాపు రామచంద్రారెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారు. వైసీపీలో చేరేందుకు సిద్ధపడ్డారు. ఇందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం జగన్ విదేశాల్లో ఉన్నారు. ఆయన ఏపీకి వచ్చిన వెంటనే కాపు రామచంద్రారెడ్డి వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. జగన్ సమక్షంలో ఆయన వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం అసెంబ్లీ సీటు నుంచి కానీ.. అనంతపురం ఎంపీ సీటు నుంచి కానీ కాపు రామచంద్రారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. రాయలసీమలో కూటమికి వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో కాపు రామచంద్రారెడ్డి ఈ సడన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంకా చాలామంది కూటమి నేతలు వైసీపీ వైపు వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!