Tuesday, April 22, 2025

2029 లో విశాఖ ఎంపీగా విజయసాయిరెడ్డి?

- Advertisement -

విజయసాయిరెడ్డి మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సన్యాసం వదిలి కాషాయం కప్పుకుంటారని సెటైర్లు పడుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఇకనుంచి రాజకీయాలు చేయనని.. రాజకీయాలు మాట్లాడనని చెప్పుకొచ్చిన విజయసాయిరెడ్డి.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. అస్సలు రాజకీయాల్లో జోలికి వెళ్ళనని తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీలో కోటరీ అంటూ కొత్త కామెంట్స్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే త్వరలో ఆయన బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడే ఈ ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఆయన కొద్ది రోజులు పాటు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ప్రారంభించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసినప్పుడు చేసిన వ్యాఖ్యలకు.. ఇప్పుడు తాజాగా చేస్తున్న వ్యాఖ్యలకు మధ్య చాలా తేడా కనిపిస్తోంది. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత చూపుతూనే రాజీనామా చేశారు. ఇప్పుడు అదే పార్టీ పట్ల విషం చిమ్ముతున్నారు.

కచ్చితంగా విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని అనుమానాలు బలపడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన కదలికలు ఉన్నాయి. ఓ మీడియా ఛానల్ ఏర్పాటులో ఆయన బిజీగా ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 2023 లోనే ఓ దినపత్రిక సైతం ప్రారంభిస్తారని టాక్ నడిచింది. అయితే ప్రస్తుతానికైతే ఓ మీడియా ఛానల్ తో పాటు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మీడియా నడిపించేందుకు విజయసాయిరెడ్డి సిద్ధపడుతున్నట్లు సమాచారం.

గతంలో తనపై వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో కథనాలు వచ్చిన సమయంలో తాను ఒక మీడియాను ఏర్పాటు చేస్తానని.. అందరూ లెక్కలు తేల్చుతానని హెచ్చరించిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆ మీడియా ఏర్పాట్లు బిజీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు బిజెపిలో చేరి రాష్ట్ర పగ్గాలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. కాదు కాదు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారని ఇంకో అనుమానం. కీలక రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తారని కూడా ఒక రకమైన ప్రచారం జరుగుతోంది. బిజెపి పెద్దలతో ఉన్న అనుబంధంతో ఈ తరహా ప్రచారం రోజురోజుకు పెరుగుతోంది.

2029 ఎన్నికల నాటికి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని కూడా మరో ప్రచారం జరుగుతుంది. గత పదిహేళ్ళుగా విశాఖ కేంద్రంగా రాజకీయాలు చేశారు విజయసాయిరెడ్డి. విశాఖ ఎంపీగా పోటీ చేయాలని భావించారు. కానీ వీలుపడలేదు. పొత్తులో భాగంగా విశాఖ ఎంపీగా 2029 లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తానని విజయ్ సాయి రెడ్డి ధీమాతో ఉన్నారు. అందుకే చంద్రబాబుకు దగ్గరయ్యేందుకు.. జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు విజయసాయిరెడ్డి. మొత్తానికి అయితే రాజకీయ సన్యాసం చేసిన విజయసాయిరెడ్డి.. కాషాయం కప్పుకుంటారన్న ప్రచారం మాత్రం పొలిటికల్ సర్కిల్లో బాగానే జరుగుతోంది. అయితే విజయసాయిరెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!